Tuesday, September 18, 2012

స్వలింగ సంపర్కం LESBIANS & HOMOS


గత కొద్దిరోజులుగా కోర్టుల్లో, పత్రికల్లో, టీవీలలో స్వలింగ సంపర్కము గురించి చర్చ జరుగుతున్నది. ఈ విషయమై ఈ వారం కొంత విపులంగా తెలుసుకుందాము. 

స్వలింగ సంపర్కము అంటే ఏమిటి ?
సహజంగా పురుషులు స్త్రీలతో సెక్సులో పాల్గొంటారు. స్త్రీలు పురుషులతో సెక్సులో పాల్గొంటారు. ఇది అందరికీ తెలిసిందే కాని కొంత మంది పురుషులకు పురుషులపై సెక్సు సంబంధించిన ఊహలు, ఆకర్షణ, కోరికలు ఉంటాయి. వారితో సెక్సులో పాల్గొంటారు. అదేవిధంగా కొంత మంది స్త్రీలు మరో స్త్రీ పై సెక్సు సంబంధించిన ఆసక్తి, ఆకర్షణ, కోరికలు కలిగి ఉంటారు. మరో స్త్రీతో సెక్సు చేస్తారు. సుఖాన్ని అనుభవిస్తారు. దీనినే స్వలింగ సంపర్కము అంటారు. యుక్త వయస్సు వచ్చేటప్పుడు తమతోటి వారిపై ఉన్న సెక్సు కుతూహలము, సరదా ప్రయోగాలు ఈ కోవ కిందకు రాదు. మగ స్వలింగ సంపర్కులను గే (gay) అంటారు. ఆడ స్వలింగ సంపర్కులను లెస్బియన్ (Lesbhian) అంటారు.

(Homosexuality) మన దేశంలో ఉందా ?
స్వలింగ సంపర్కము ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉంది. భారత దేశంలోనూ ఉంది. కాని జనబాహుళ్యంలో యింతమంది స్వలింగ సంపర్కులు ఉండరు. ఇండియాలో ఎంత మంది మగవారు పూర్తిగా స్వలింగ సంపర్కులో ఖచ్చితంగా తెలియదు, ఇరవై సంవత్సరాలు దాటిన మగవారిలో ప్రతి వందమందిలో ఒకరు హోమోసెక్సువల్ అని అంచనా. అలాగా మన దేశంలో ప్రతి 250 మంది స్త్రీలలో ఒకరు పూర్తిగా హోమోసెక్సువల్.

ఇంతకుముందు ఎరగని ఈ ప్రవర్తన యిప్పుడెట్లా వచ్చింది ?

స్వలింగ సంపర్కము యిప్పుడొచ్చినది కాదు. అనాదిగా ఉన్నదే.

ప్రకృతిని ఆరాధించే కాలంలో అంతే క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం వరకు స్వలింగ సంపర్కము వింతగా చూడబడలేదు. ఆకాలంలో వర్థిల్లిన గ్రీకు, రోమన్ సంస్కృతులలో స్వలింగ సంపర్కము చెడ్డది అనుకోలేదు. వారి సెక్సు జీవితంలో స్వలింగ సంపర్కము ఒక భాగంగా ఉండేది. చాలా మంది చక్రవర్తులు భార్యలతో పాటు, కౌమార బాలురతో కూడా సెక్సులో పాల్గొనేవారు. ఆ రోజుల్లో వాడుకపదం భార్యలు పిల్లల కోసం, కౌమార బాలురు (Adolescent boys) సుఖం కోసం.

దేవుడు, మతము ప్రాధాన్యత పెరిగిన తర్వాత అన్ని మతాలు స్వలింగ సంపర్కము పాపము, అసహజము అని బోధించాయి. కఠిన శిక్షలు అమలు చేశాయి.

గత రెండు శతాబ్దాలలో శాస్త్ర విజ్ఞానం అందుబాటులోకి వచ్చాక, స్వలింగ సంపర్కము ఒక జబ్బు, మానసిక రోగులు మాత్రమే హోమోసెక్సు చేస్తారు. వారిని కట్టడి చేయాలి. వారికి చికిత్స చేయాలి అనే భావన ప్రబలింది.

ఇరవై శతాబ్దపు ప్రథమార్థంలో స్వలింగ సంపర్కము అనేది ఉంది అని ఒప్పుకున్నారు. కాని అది ఒక మానసిక వైపరీత్యము. సలహాలు, మందులు యివ్వాలి అనేవారు.

గత ఏభై సంవత్సరాల నుండి స్వలింగ సంపర్కము ఒక జబ్బు కాదు, మానసిక రోగం కాదు, మానసిక సమస్య కాదు. సెక్సు చేసే పద్ధతుల్లో అది ఒకటి. కొందరికి అది యిష్ట ముంటుంది. అట్లా చేసే వారిని లైగింక అల్ప సంఖ్యాక వర్గాలుగా (Sexual Minorites) గుర్తిస్తున్నారు. వారిని కూడా మామూలు మనుషులుగా చూడాలి. అన్ని హక్కులు కల్పించాలి.

మొట్ట మొదట ఎయిడ్స్ రోగం మన స్వలింగ సంపర్కులలో ఎక్కువగా గుర్తించారు. కాని ఆ తర్వాత ఎయిడ్స్ అందరిలో వస్తుంది అని తెలిసింది. ఆ మధ్య కాలంలో మగ హోమోసెక్స్‌వల్ (Gays) ను వ్యతిరేకించటం, అసహ్యంగా చూడటం, వారికి దూరంగా ఉండటం, వారంటే భయపడటం చేశారు. దీన్నే Homophobia అంటారు.

స్వలింగ సంపర్కము యింతకుముందూ ఉంది. ఇపుడూ ఉంది. ఇంతకుముందు దాని గురించి తెలియదు. వాళ్ళు బయటపడేవాళ్ళు కాదు. ఇప్పుడు దాని గురించి ప్రజలకు అవగాహన వచ్చింతర్వాత, కొంతమంది హోమోసెక్సువల్స్ బయట పడుతున్నారు. ఇంతవరకు గుంభనంగా జరిగేది, యిప్పుడు కొంత బహిరంగంగా జరుగుతుంది. అంతే.

ఎక్కువ మంది చేసేది ఒప్పు, బహు కొద్ది మంది చేసేది తప్పు అనుకుం టాము. కుడిచేతితో వ్రాసే వారు మంచి వారు ఎడమ చేతితో వ్రాసేవారు చెడ్డవారు అనగలమా? అదే విధంగా ప్రపంచంలో ఒక శాతం మంది వేరే ఎవరికి కష్టం కలగకుండా చేసేపనికి తప్పు, అసహజము, అనైతికము అనగలమా?

హోమోసెక్సులుగా కావటానికి కారణాలు, వాళ్ళలో రకాలు

శారీరకంగా, మానసికంగా, సెక్సుపరంగా పూర్తిగా మగకాని, ఆడకాని వారి గురించి - వీరినే తృతీయ ప్రకృతి - Third gender అంటారు. వీరిలో కూడా చాలా రకాలు ఉంటాయి.

1. Intersex : జన్యుపరంగా, హార్మోనుల పరంగా, లైంగిక భాగాల తయారీలో తప్పులున్నప్పుడు, పుట్టుకతోనే కొందరు పూర్తి మగ లేదా పూర్తి ఆడ కాకుండా తయారవుతారు. వీరిలో కొంతమందిలో ఆపరేషనుల ద్వారా, మందుల ద్వారా సరిచేయవచ్చు.

2. Homosex: వీరు స్వాభావికంగా, మానసికంగా, శరీరపరంగా పూర్తిగా మగలా గాని, ఆడలా గాని ఉంటారు. వీరిక లైంగిక ఆకర్షణ మాత్రం స్వజాతిపైనే ఉంటుంది. వీరిని Gay, lesbian అంటారు.

3. Bisexual: వీరు శారీరకంగా, మానసికంగా, సమాజపరంగా మామూలుగానే ఉంటారు. వీరి కత్తికి రెండువైపులా పదును ఉంటుంది. వీరిలో మగవారిలో మగవారిపైన, ఆడవారిపైనా - యిద్దరిపైనా సెక్సు కోరికలు ఉంటాయి. సెక్సు చేయగలరు. అదేవిధంగా స్త్రీలలో స్త్రీలపైన, పురుషులపైనా యిద్దరిపైనా సెక్సు కోరికలు ఉంటాయి. సెక్సుకు స్పందించగలరు.

4. Transgender, Transsexual: వీళ్ళు చూడటానికి మగవారు మగవారిలాగాను, ఆడవారు ఆడవారిలాగానూ ఉంటారు. తల్లిదండ్రులు అట్లానే పెంచుతారు. వీరిలో మగవారు తమను ఆడవారిలాగా ఊహించుకుంటారు. మగవారిలా ఉండటాన్ని అసహ్యించుకుంటారు. దేవుడు తనను - ఒక స్త్రీని మగవాడిలా పుట్టించాడు అనుకుంటారు. తమను మగ శరీరంలో బంధించబడ్డ ఆడవారిగా అనుకుంటారు. అదే విధంగా - స్త్రీలు తమను పురుషునిగా ఊహించుకుంటూ, పురుషునిగా ప్రవర్తిస్తూ, మరో మామూలు స్త్రీని పెళ్ళి చేసుకోవటానికి సిద్ధపడతారు. వీరిని Transgenders అంటారు. ఇట్లాంటివాళ్ళు కొందరు లింగ మార్పిడి (Sex Change) ఆపరేషను చేయించుకుని తమకు కావలసిన విధంగా మారిపోతారు. వీరిని Transsexual అంటారు.

5. Eunuchs కొజ్జాలు: పూర్వం రాజులకు, నవాబులకు చాలామంది భార్యలు ఉండేవారు. వారికి రాణివాసాలు, జనానాలు ఉండేవి. వాటికి కాపలాగా మగవారిని నియమించే వారు కాదు. మగ బానిసలకు వృషణాలు, లింగాలు కత్తిరించి, వారిని బలంగాను, నపుంసకులుగాను తయారుచేసి జనానాకు కాపలాదారుగా, సేవకులుగా నియమించేవారు. వీరినే కొజ్జాలనేవారు. ఇప్పుడు కొంతమంది మగవారు తమ ఆట పాటలతో గాని, యాచించిగాని, వ్యభిచరించిగాని బతుకుతున్నారు.

స్వలింగ సంపర్కుల గురించి అపోహలు

మనందరికి మగ హోమోసెక్సువల్స్ అంటే - ఆడంగి లక్షణాలతో, సినిమాలలో చూపించే మాడా లాగా, చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు అని పాడుతూ ఉంటారు - అనే భావన ఉంది. అది తప్పు. Gayలలో 15 శాతం మంది మాత్రమే అలా ప్రవర్తిస్తారు. 5 శాతం మంది మామూలు మగవాళ్ళలానే కనిపిస్తారు, ప్రవర్తిస్తారు. అందరిలానే ఉంటారు, ఉద్యోగాలు చేస్తారు. వారిని మనమెవరమూ గుర్తించలేము. వారంతట వారు బయటపడితే తప్పితే వీరిని గేగా ఊహించను కూడా లేము. అదేవిధంగా Lesbian స్త్రీలు చాలా మంది మామూలు స్త్రీలలానే ఉంటారు. కొద్దిమంది మాత్రమే మగరాయుడులాగా ప్రవర్తిస్తారు. బాహ్యరూపాన్ని బట్టి లెస్బియన్‌ను గుర్తించలేము.

స్వలింగ సంపర్కము ఎందువలన వస్తుంది

కొద్దిమంది మాత్రమే Homosexual లాగా ఎందుకు ప్రవర్తిస్తారో తెలియదు. Genes, Hormones మెదడు తయారీ, శరీరంలో తయారయ్యే రసాయనాలు - వీటిల్లో ఏవి హోమోసెక్సుకు కారణం అని అన్వేషించారు. ఏదీ నిర్ధారణ కాలేదు. తల్లిదండ్రుల పెంపకం, తల్లిదండ్రుల ఆలోచనలు, వారి చిన్నతనంలో జరిగిన సంఘటనలు, యుక్త వయస్సులో కలిగే అనుభవాలు, వీటినన్నిటినీ పరిశీ లించిన తర్వాత గూడా హోమోసెక్సుకు కారణం కనుగొనలేకపోయారు. ఇది పుట్టుకతోనే వస్తుం ది. వారిలో అంతర్లీ నంగా దాగి ఉంటుంది. తర్వాత జరిగే సంఘ టనలు, అను భవాలు, ఆకర్షణల వలన ఆ వ్యక్తి తనకుతానుగా హోమోసెక్సువల్‌గా గుర్తించగలుగుతారు. ఒక వ్యక్తిని వేరెవరో హోమో సెక్సువల్‌గా మార్చలేరు.

No comments:

Post a Comment